

మూడు దశాబ్దాల తర్వాత కడప జడ్పీ పీఠం టీడీపీకి దక్కేనా.?
వైఎస్సార్ కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి (టీడీపీ, బీజేపీ, జనసేన) ఆధిపత్యం చాటుకుంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సమయానికి 23 జడ్పీటీసీ స్థానాలు కూటమి ఖాతాలో ఏకగ్రీవంగా చేరాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ 19 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ మూడు, జనసేన ఒక స్థానంలో ఏకగ్రీవంగా విజయం సాధించింది. దీంతో జిల్లా పరిషత్‌పై కూటమి పట్టు బిగించింది.
జిల్లా మొత్తం 39 జడ్పీటీసీ స్థానాల్లో 23 స్థానాలు ఏకగ్రీవం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్యర్థులు పోటీలో లేకపోవడంతో ఈ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల అధికారులు ధ్రువీకరించినట్లు సమాచారం. మిగిలిన స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది.
నియోజకవర్గాల వారిగా ఏకగ్రీవాల వివరాలు.!
కమలాపురం నియోజకవర్గం.!
కమలాపురం నియోజకవర్గ పరిధిలో కూటమి ఆరు స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది. సీకే దిన్నె మండలం నుంచి భవాని పాలగిరి, వల్లూరు నుంచి పుత్తా హరితారెడ్డి, చెన్నూరు నుంచి కల్లూరు విజయభాస్కర్ రెడ్డి, వీరపునాయునిపల్లి నుంచి పుత్తా నరసింహారెడ్డి, పెండ్లిమర్రి నుంచి నార్రెడ్డి పద్మజ టీడీపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమలాపురం మండలం నుంచి కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థి మోతిమేర రాముడు ఏకగ్రీవంగా గెలుపొందారు.
పులివెందుల నియోజకవర్గం.!
పులివెందుల నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొండూరు నుంచి పి. శివమోహన్ రెడ్డి, సింహాద్రిపురం నుంచి మారెడ్డి జై భారత్ రెడ్డి, చక్రాయపేట నుంచి రేణుకకు పోటీ లేకపోవడంతో విజయం వరించింది.
మైదుకూరు నియోజకవర్గం.!
మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ఖాజీపేట, దువ్వూరు, చాపాడు మండలాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖాజీపేట నుంచి దేవనబండ వైష్ణవి, దువ్వూరు నుంచి బోరెడ్డి ఇందు, చాపాడు నుంచి పెరుగు వీరనారాయణ యాదవ్ విజయం సాధించారు.
జమ్మలమడుగు నియోజకవర్గం.!
జమ్మలమడుగు నియోజకవర్గంలో బీజేపీ మూడు స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఎర్రగుంట్ల నుంచి మేకల చైతన్య, ముద్దనూరు నుంచి చాదిపిరాళ్ల గోవర్ధన్ రెడ్డి, జమ్మలమడుగు మండలం నుంచి చాదిపిరాళ్ల రాజేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొండాపురం మండలం నుంచి టీడీపీ అభ్యర్థి పాముగారి నాగేశ్వర్ రెడ్డి విజయం సాధించారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గం.!
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని రెండు గ్రామీణ మండలాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొద్దుటూరు రూరల్ నుంచి బచ్చల వీరప్రతాప్, రాజుపాలెం నుంచి ఉప్పలపాటి గురువయ్యకు పోటీ లేకపోవడంతో విజయం వరించింది.
బద్వేలు నియోజకవర్గం.!
బద్వేలు నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బద్వేలు నుంచి సింధు జక్కల, పోరుమామిళ్ల నుంచి చాంద్భాయ్గారి హబీబున్నీసా, అట్లూరు నుంచి పోతాపి నరసింహులు జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు.
రాజంపేట నియోజకవర్గం..!
రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వీరబల్లి, సిద్ధవటం మండలాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. వీరబల్లి నుంచి చమర్తి శోభ, సిద్ధవటం నుంచి చింతలబోయిన చలమయ్య యాదవ్ ఎన్నికయ్యారు.
మూడు దశాబ్దాల తర్వాత టీడీపీకి జడ్పీ పీఠం దక్కేనా.?
కడప జిల్లా పరిషత్‌లో మూడు దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీకి చైర్మన్ పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 39 జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ 19 స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకోగా, కూటమి జతైన బీజేపీ మూడు, జనసేన ఒక పేర్లను దక్కించుకున్నాయి. మొత్తంగా 23 స్థానాలు కూటమి ఖాతాలో చేరడంతో జడ్పీ ఛైర్మన్ ఎన్నికపై ఆసక్తి నెలకొంది.
కూటమి నుంచి టీడీపీకి చైర్మన్ పదవి కేటాయిస్తే ఆ పార్టీకి సుదీర్ఘ విరామం తర్వాత ఈ అవకాశం దక్కినట్లవుతుంది. అయితే, చైర్మన్ ఎంపికపై కూటమి నాయకత్వం తీసుకునే నిర్ణయం కీలకం.
జడ్పీ చైర్మన్ రేసులో ఎవరున్నారు.?
జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కూటమికి దక్కే అవకాశాలు ఉండటంతో టీడీపీలో ఆశావహులపై చర్చ మొదలైంది. కూటమి నుంచి గెలుపొందిన మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. జమ్మలమడుగు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన చాదిపిరాళ్ల రాజేష్ రెడ్డి కూడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కడప జడ్పీ పీఠంపై గతంలో ఎవరు.?
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడప జిల్లా పార్టీకి లభించింది. 1987 ప్రాంతంలో సీఎం బలరామిరెడ్డి టీడీపీ జడ్పీ చైర్మన్‌గా ఎన్నికైనట్లు చారిత్రక వివరాలు ఉన్నాయి. 1995లో జడ్పీటీసీ సభ్యుల ద్వారా జరిగిన ఎన్నికల్లో నరరెడ్డి తులసిరెడ్డి చైర్మన్‌గా ఎంపికయ్యారు.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కె. సురేష్‌బాబు, దేవిరెడ్డి జ్యోతిరెడ్డి జడ్పీ చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టారు. వైసీపీ ఆవిర్భావం గూడూరు రవి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆ పార్టీకి ఈ పదవిని అందించారు. అనంతరం రామ్ గోవింద్ రెడ్డి జడ్పీ ఛైర్మన్‌గా కొనసాగారు.
ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఆధిపత్యం చాటుకోవడంతో జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. టీడీపీకి ఈ పదవి దక్కితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కడప జడ్పీలో ఆ పార్టీ మరోసారి చైర్మన్ దక్కించుకున్నట్లవుతుంది.
శ్రేణుల్లో సంబరాలు.!
జిల్లావ్యాప్తంగా 23 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో కూటమి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం. పలు మండల కేంద్రాల్లో కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిగిలిన స్థానాల ఎన్నికల ఫలితాలు, జడ్పీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందన్న అంశాలు ఇప్పుడు జిల్లాలో రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
[ Kadapa ZP Elections, Kadapa Zilla Parishad, TDP, Telugu Desam Party, BJP, Jana Sena Party, Chandrababu Naidu, Coalition Victory, ZPTC Elections, Unopposed ZPTC Seats, Kadapa Local Body Elections, 23 ZPTC Seats, TDP Victory, Kadapa ZP Chairperson, Andhra Pradesh Politics ]