

రాను రానంటూనే చిన్నదీ రాములోరి గుడికొచ్చే అనే పాట చందంగా రాజకీయాలలో పొత్తుల విషయంలో బీజేపీ వ్యవహరిస్తోంది. తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో సొంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లోనూ, జాతీయ స్థాయిలోనూ జనసేన ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీయే అయినా, తెలంగాణలో మాత్రం ఆ పార్టీతో ఎటువంటి పొత్తు ఉండదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఇప్పటికే పలుమార్లు విస్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పోటీకి జనసేన రెడీ అవుతోంది. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన జనసేనతో కలిసి ముందుకు సాగాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో జరగనున్న ఎమ్మెల్సీ పోరులో జనసేన అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఆ పార్టీకి అండగా నిలబడుతున్న అంశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆంధ్రప్రదేశ్ అధికారికంగా మిత్రపక్షాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న జనసేన, బీజేపీలు, తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకూ ఎవరికి వారే యమునా తీరే చందంగా ఉన్నారు. అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి తీరు మార్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, రెండు పార్టీలూ అనివార్యంగా అవగాహనకు వచ్చాయంటున్నారు పరిశీలకులు.
జనసేన అభ్యర్థి బరిలో నిలిచే స్థానంలో బీజేపీ తన అభ్యర్థిని పోటీకి పెట్టకుండా పరోక్షంగా మద్దతు తెలిపేలా ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరిందన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇదే జరిగితే.. ముందు జరగనున్న స్థానిక ఎన్నికలు, ఆ పై 2028 అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ రెండు పార్టీలు జతకట్టే అవకాశాలు మెండుగా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
[Jana Sena BJP Alleance Telangana, MLC Elections, Graduate MLC,Telangana Politics, , Warangal Khammam Nalgonda Graduates MLC, Telugu One]