

పెను తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దట్టమైన మబ్బులు కమ్ముకుని పగలే చిమ్మచీకట కమ్మేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం (అక్టోబర్27) రాత్రి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత కొన్ని గంటలుగా సముద్రంలో తీవ్ర రూపం దాల్చిన ఈ తుపాను క్రమంగా తీరం వైపు దూసుకువస్త ఉత్తర కోస్తా జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి, ఉదయం నుంచే మేఘావృతమైంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిలో దట్టమైన మేఘాలు అలుముకోవడంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తీరప్రాంత ప్రజల్లో ఆందోళన. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంత గంటకు వందకు పైగా వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్ర అలలలో ఎగిసిపడుతుండటంతో తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.
వాతావరణంలో వచ్చిన ఈ అకస్మాత్తు మార్పుల కారణంగా సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పాఠశాలలు, విద్యా సంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించగా, అత్యవసర సేవల సిబ్బందిని మినహాయించి మిగిలిన శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేశారు. రోడ్లపైకి చెట్లు కూలిపోయే ప్రమాదం కారణంగా రవాణా వ్యవస్థకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరాలకు ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దించారు.
గతంలో వచ్చిన తుపానుల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అత్యంత పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను ఇప్పటికే మోహరించారు. సహాయక సామగ్రిని, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు. ప్రజలు ఏ క్షణంలోనైనా అధికారులను సంప్రదించడానికి ప్రత్యేక టెలిఫోన్ నంబర్లు, వాట్సాప్ హెల్ప్‌లైన్‌లను అందుబాటులోకి తెచ్చారు.

కాగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఈ రాత్రి నుంచి పోలవరం, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
[Cyclone Arnab Effect Started, Heavy Rains North Andhra, Supertides, Sea, Strong Winds, Telugu One]
