
.webp)
మన ఆరోగ్యానికి పెనుగా మారిన అనేక వ్యాధులలో క్యాన్సర్ ప్రధానమైనది. శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి రావచ్చు. నియంత్రణ పెరుగుదల అదుపు తప్పి, ఇతర అవయవాలకు వ్యాపించడమే ఈ సమస్యకు ముఖ్య కారణం. ఈ జబ్బు తీవ్రత గురించి ప్రతి ఒక్కరికీ స్పష్టమైన అవగాహన ఉండాలి. మొదట్లోనే గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడుకునే అవకాశం లభిస్తుంది. ఇందుకోసమే మన దేశంలో ప్రతి ఏటా నవంబర్ ఏడో తేదీన జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రజల్లో అపోహలు తొలిగించి, ముందస్తు పరీక్షలు, సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడటమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
చరిత్ర..
మన దేశంలో క్యాన్సర్ విస్తరణను అరికట్టడానికి, ముందుగానే ఈ వ్యాధిని గుర్తించడానికి 2014 సెప్టెంబరులో అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, నవంబర్ ఏడో తేదీని జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా ప్రకటించారు. నాటి నుంచి ప్రతి సంవత్సరం ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సేవా విభాగాలు, ఆసుపత్రులు కలిసి వ్యాధి నివారణపై అవగాహన సదస్సులు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
మన దేశంలో క్యాన్సర్ పరిస్థితి చూస్తే ఇది ఎంత తీవ్రమైన సమస్యో అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కోటి మందికి పైగా ఈ వ్యాధితో కన్నుమూస్తున్నారు. భారతదేశంలో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రతి ఏటా సుమారు ఏడు లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. విచారకరమైన విషయమేమిటంటే, కొత్తగా నమోదవుతున్న కేసుల్లో మూడింట రెండు వంతుల కేసులు వ్యాధి ముదిరిపోయిన దశలోనే బయటపడుతున్నాయి. దీనివల్ల నయం చేయడం కష్టంగా మారుతోంది. బాధితుల్లో నలభై ఐదు శాతం కన్నా ఎక్కువ మంది ముప్పై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల వయస్సు ఉన్నవారే ఉన్నారు.
మగవారిలో నోటి క్యాన్సర్, ఊపిరితిత్తులు, జీర్ణశయానికి సంబంధించిన క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్లు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. పొగాకు , దానికి సంబంధించిన క్యాన్సర్లను వాడటం వల్ల మన దేశంలో యాభై శాతం మగవారికి, పాతిక శాతం మహిళల క్యాన్సర్లకు ప్రధాన కారణమవుతోందట. మారుతున్న జీవనశైలి వల్ల రాబోయే కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటించవచ్చు..
పొగాకు, సిగరెట్లు, మద్యం అలవాట్లకు దూరంగా ఉండటం మొదటి మెట్టు. రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ, మెయింటైన్ చేయాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రమాదకరమైన సూర్యరశ్మి , రసాయన పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అన్నింటి కంటే ముఖ్యంగా, ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం వల్ల క్యాన్సర్‌ను తొలినాళ్లలోనే గుర్తించి పూర్తీగా నయం చేసుకోవచ్చు.
వ్యాధి వచ్చిన తర్వాత బాధపడటం కంటే రాకుండా చూసుకోవడమే సరైన మార్గం. ఎలాంటి చిన్న మార్పు లేదా లక్షణం శరీరంలో కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. సరైన అవగాహన, ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుంది.
*రూపశ్రీ.
