

టి20 వరల్డ్ కప్లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం (ఫిబ్రవరి 15) జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంపై దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ప్రపంచ కప్ విజయంతో సమానమైన విజయంగా భారత అభిమానులు దీనిని అభివర్ణిస్తున్నారు. దాయాది దేశంపై తన విజయాల సంఖ్యను టీమ్ ఇండియా మెరుగుపరుచుకుంది. దేశం నలుమూలలా పాకిస్థాన్ పై భారత్ విజయాన్ని పురస్కరించుకుని సంబరాలు చేసుకున్నారు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ టీమ్ ఇండియా విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. జనంరోడ్లపైకి వచ్చి త్రివర్ణ పతకాన్ని చేతపట్టి జైభార్, జయహో భారత్ అంటూ నినాదాలు చేస్తూ టపాసులు కాలుస్తూ తమ ఆనందాన్ని, హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశారు. ఇది సహజం. అయితే పాకిస్థాన్ భూ భాగంలో కూడా ఇండియా గెలుపును వేడుకగా జరుపుకున్నారు. ఔను బలుచిస్తాన్ లో జనం రోడ్లపైకి టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై టీమ్ ఇండియా విజయాన్ని సెలబ్రేట్ పొందింది. రోడ్లపై డ్యాన్సులు చేశారు. టీం ఇండియాకు, భారత్కు అనుకూలంగా నినాదాలు చేశారు.
పాకిస్థాన్ లోని మిగిలిన ప్రాంతాల్లో పాకిస్థాన్ ఓటమిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం తీవ్ర ఆగ్రహంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డును, జట్టును దుమ్మెత్తి పోస్తున్నారు. కొన్ని చోట్ల పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై ఆగ్రహంతో టీవీ పగులగొట్టిన సంఘటనలు జరిగాయి. దీనికి సంబంధించిన వార్తలన పాకిస్తాన్ జాతీయ మీడియా ప్రసారం చేసింది.
