Table of Contents

బట్టలు శుభ్రంగా ఉండాలంటే మంచి వాషింగ్ మెషిన్ ఉంటే సరిపోదు.. దానికి సరిపోయే డిటర్జెంట్‌ను కూడా ఎంచుకోవాలి. ప్రస్తుతం బట్టలు ఉతకడానికి సబ్బులు, పౌడర్ డిటర్జెంట్లు, లిక్విడ్ డిటర్జెంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏది ఎప్పుడు వాడాలి? టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లలో ఏది ఉపయోగించాలి? తెల్లని బట్టలు, రంగు బట్టలు, సున్నితమైన వస్త్రాలకు ఏది మంచిదో తెలుసుకోవాలి.
సబ్బు ఎప్పుడు వాడాలి?
బట్టల సబ్బును చేతితో ఉతికేటప్పుడు, కాలర్‌లు, చేతుల దగ్గర ఉన్న మురికి మరకలను రుద్ది తొలగించడానికి ఉపయోగించవచ్చు. అయితే వాషింగ్ మెషిన్‌లో సాధారణ సబ్బును వేయడం మంచిది కాదు. దీనివల్ల సబ్బు అవశేషాలు మెషిన్‌లో పేరుకుపోవడంతో పాటు బట్టలపై కూడా మిగిలే అవకాశం ఉంటుంది.
సర్ఫ్ పౌడర్ ఎవరికి మంచిది?
సాధారణంగా తెల్లని కాటన్ బట్టలు, ఎక్కువ మురికి ఉన్న దుస్తులు, మట్టితో తడిసిన పిల్లల బట్టలు ఉతకడానికి పౌడర్ డిటర్జెంట్లు ఉపయోగపడతాయి. అయితే చల్లటి నీటిలో కొన్ని పౌడర్లు పూర్తిగా కరగక బట్టలపై తెల్లటి మరకలు ఏర్పడవచ్చు. అందుకే సరైన మోతాదులో వాడాలి.
లిక్విడ్ డిటర్జెంట్ ఎప్పుడు వాడాలి?
రంగు బట్టలు, నల్లని దుస్తులు, జిడ్డు మరకలు ఉన్న బట్టలకు లిక్విడ్ డిటర్జెంట్ ఉపయోగపడుతుంది. చల్లటి నీటిలో కూడా సులభంగా కలుస్తుంది. ఆయిల్, ఆహారపు మరకలపై ముందుగా కొద్దిగా రాసి శుభ్రం చేసే అవకాశం కూడా ఉంటుంది. సిల్క్, ఉన్ని వంటి సున్నితమైన వస్త్రాలకు మాత్రమే వాటి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మైల్డ్ డిటర్జెంట్ ఎంచుకోవాలి.
ఏ వాషింగ్ మెషిన్‌కు ఏది వాడాలి?
- ఫ్రంట్ లోడ్ మెషిన్: తక్కువ నురుగు వచ్చే ఫ్రంట్ లోడ్ లేదా మేటిక్ డిటర్జెంట్ మాత్రమే వాడాలి. సాధారణ చేతి ఉతుకుడు పౌడర్ వేస్తే నురుగు ఏర్పడి మెషిన్ పనితీరుపై ప్రభావం పడవచ్చు.
- టాప్ లోడ్ మెషిన్: టాప్ లోడ్ మెషిన్‌కు అనువైన పౌడర్ లేదా లిక్విడ్ డిటర్జెంట్ వాడాలి. తయారీ సంస్థలను సూచనలను పాటించాలి.
- సెమీ ఆటోమెటిక్ మెషిన్: ఆ మెషిన్‌కు అనుకూలమైన డిటర్జెంట్‌ను ఎంచుకోవాలి. ప్యాకెట్ పై సూచనలు పరిశీలించాలి.
ఈ తప్పులు చేయకండి
ఎక్కువ డిటర్జెంట్ వేస్తే బట్టలు మరింత శుభ్రం అవుతాయనుకోవడం పొరపాటు. అధిక నురుగు, సబ్బు అవశేషాలు బట్టలపై మిగిలే ప్రమాదం ఉంది. బట్టల బరువు, మురికి స్థాయి, నీటి గట్టిదనాన్ని బట్టి ప్యాకెట్‌పై సూచించిన మోతాదులోనే డిటర్జెంట్ వాడాలి. ముఖ్యంగా బట్టలపై ఉన్న వాషింగ్ సూచనలను చదివి ఉతకడం మంచిది.

