

మన దేశం నుంచి ఆస్కార్‌కు అధికారికంగా ఎంపికైన సినిమా తెలుగులోకి వస్తుంటే సహజంగానే ఆసక్తి ఉంటుంది. అందులోనూ సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సినిమా కావడంతో అంచనాలు మరింత పెరుగుతాయి. అదే మరాఠీ సినిమా ‘గోంధళ్’ (Gondhal). తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై చర్చ మొదలైంది.
సంతోష్ దవఖర్ స్వయంగా కథ రాసి, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించిన సినిమా ‘గోంధళ్’. 2027లో జరిగే 99వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ ఇండియా నుంచి అధికారిక ఎంట్రీగా ఈ సినిమా ఎంపికైంది. సెప్టెంబర్ 18న ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. మొత్తం 33 సినిమాల నుంచి ‘గోంధళ్’ను ఎంపిక చేశారు.
నవంబర్‌లో మరాఠీ భాషలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు సంతోష్ దవఖర్కు గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుడిగా సిల్వర్ పీకాక్ అవార్డు లభించింది. ఇప్పుడు ఆస్కార్ ఎంట్రీగా ఎంపిక కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది.
మహారాష్ట్రలోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. సుమన్ అనే యువతి అసంతృప్తికరమైన వైవాహిక జీవితంలో చిక్కుకుపోతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు తన ప్రియుడు సర్జేరావ్కు సంప్రదాయ గోంధళ్ ఆచారంపై ఉన్న అమితమైన నమ్మకాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది.
కొత్తగా పెళ్లైన జంట కోసం రాత్రంతా నిర్వహించే సంప్రదాయ గోంధళ్ కార్యక్రమం చుట్టూ కథ తిరుగుతుంది. అయితే ఆ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. వ్యక్తిగత కోరికలు, కుటుంబ బాధ్యతలు, రహస్యాలు, మోసాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఆ రాత్రి ఏం జరిగింది? అసలు సుమన్ ఏం చేయాలనుకుంది? అనేది సినిమాలో చూడాలి.
తాజాగా విడుదలైన ట్రైలర్లో సస్పెన్స్, మిస్టరీ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామీణ వాతావరణం, సంప్రదాయ ఆచారాలు, పాత్రల మధ్య సంఘర్షణలు కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా సినిమాలోని చిక్కుముడులు, ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.
ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ ఇళయరాజా సంగీతం. కథలోని భావోద్వేగాలకు, సస్పెన్స్‌కు తగ్గట్టుగా ఆయన అందించిన సంగీతం ట్రైలర్లో ప్రత్యేకంగా నిలుస్తోంది.
‘గోంధల్’ సినిమాలో కిషోర్ కదమ్, ఇషితా దేశ్‌ముఖ్, యోగేష్ సోహోని, నిషాద్ భోయిర్, అనుజ్ ప్రభు కీలక పాత్రల్లో నటించారు. అమలేందు చౌదరి సినిమాటోగ్రఫీ అందించారు.
ఈ చిత్రాన్ని నవంబర్ 13న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. మరాఠీతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇది కూడా చదవండి: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. ఓటీటీలోకి రాజమౌళి మూవీ.!
[Gondhal Telugu Trailer, Indias Oscar Entry 2027, Gondhal Telugu Release Date, Gondhal Trailer Telugu, Gondhal Movie Story, Santosh Davakhar, Ilaiyaraaja, Hombale Films, Telugu Film News]
